ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును ఓడించడం చాలా కష్టమని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్ అన్నారు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ కోసం భారత్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సైతం పటిష్ఠంగా కనిపిస్తున్నాయని డేవ్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో జరిగే ఈ ప్రపంచకప్‌లో 1992లో మాదిరిగా రౌండ్ రాబిన్ పద్ధతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.
“ప్రపంచ విజేత ఎవరో ఊహించడం కష్టం. నిజం చెప్పాలంటే భారత్ అత్యద్భుతంగా ఆడుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా సైతం అదరగొడుతోంది. ఈ మధ్య కాలంలో టీమిండియాలో మెరుగుదలను చూస్తుంటే ఆ జట్టును ఓడించడం చాలా కష్టంగా అనిపిస్తోంది”అని రిచర్డ్‌సన్ తెలిపారు.
ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో స్నేక్ పద్ధతిని అనుసరించడంతో లీగ్ దశలో భారత్, పాక్ తలపడే అవకాశం రాలేదని డేవ్ అన్నారు. ర్యాంకుల ప్రకారం వరుసగా ఒక్కో జట్టును రెండు గ్రూపుల్లో అమర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బహుశా ఈ రెండు జట్లు సెమీస్ లేదా ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుందన్నారు.