HomeTelugu Big Storiesజగన్‌ కేబినేట్‌లో లేని రోజా!

జగన్‌ కేబినేట్‌లో లేని రోజా!

13 3ఏపీ మంత్రివర్గ కూర్పు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మొత్తం 25 మందికి జగన్‌ తన జట్టులో చోటు కల్పించారు. అందులో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులను కట్టబెట్టారు. వీరంతా శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ జట్టులో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు కేబినెట్‌లో పెద్ద పోస్టే దక్కుతుందని మొదటి నుంచి ఊహాగానాలు వినిపించాయి. చివరికి ఆ జాబితాలో పేరు లేకపోవడం గమనార్హం.

ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు గానూ వైసీపీ 151 స్థానాలు దక్కించుకుంది. అందులో 14 మంది మహిళలు ఉన్నారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు అనే పేరు వినిపించగానే ప్రముఖంగా రోజా పేరే అందరి నోటా నానింది. అటువైపు పార్టీ తరఫున బలంగా వాణి వినిపించే మహిళా నేతగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. అయినా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా సరే.. తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురిలో సుచరిత మినహా మిగిలిన ఇద్దరూ రోజాలానే రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. అందులో మొదటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపించాయి. మరో మంత్రి పదవి విషయంలో రోజాకు, భూమన కరుణాకర్‌రెడ్డికి మధ్య పోటీ ఉందని అందరూ అనుకున్నారంతా. వస్తే వీరిద్దరిలో ఎవరికో ఒకరికి పదవి వస్తుందని ఊహించినప్పటికీ.. అనూహ్యంగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామికి చోటు దక్కడం గమనార్హం. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన జగన్‌.. మరో రెండున్నరేళ్ల తర్వాతే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని ఇదివరకే స్పష్టం చేశారు. ఆ జట్టుతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నారన్నమాట. దీని ప్రకారం చూస్తే రోజాకు మంత్రివర్గంలో అవకాశం దక్కాలంటే మరో రెండున్నరేళ్ల ఎదురుచూడాల్సిందేనా? లేదా మంత్రి పదవి బదులు ఇంకేదైనా పదవి ఇస్తారో చూడాలి!! దీనిపై రోజా కూడా స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu