పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ చర్యలు తీసుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుందని నితిన్ గడ్కరీ తెలిపారు. ‘సింధూ నది జలాల విషయంలో మన దేశ వాటా నీటిని పాకిస్థాన్‌కు వెళ్లనీయకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నీళ్లను మేము తూర్పు నదుల్లోంచి మళ్లించి, జమ్ముకశ్మీర్, పంజాబ్‌లోని ప్రజలను అందిస్తాం. రావి నదిపై షాపుర్‌కాందీ డ్యామ్ ప్రాజెక్టును ప్రారంభించాం. యూజేహెచ్ ప్రాజెక్టు ప్రాంతంలో మన వాటా నీళ్లని నిల్వ చేసి, జమ్ముకశ్మీర్‌కి అందిస్తాం. అలాగే, మిగులు జలాలను రావి-బియాస్ లింక్ ద్వారా పరివాహక ప్రాంతాలకు అందిస్తాం. ఈ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటిస్తున్నాం’ అని ఆయన కొద్దిసేపటి క్రితం తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటించారు.
సింధు ఒప్పందం ప్రకారం సింధు బేసిన్‌లోని ఆరు నదులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై రెండు దేశాలు అప్పట్లో సర్దుబాట్లు చేసుకున్నాయి. ఈ ఆరింటిలో మూడు నదులపై భారత్‌కు, మూడు నదులపై పాకిస్థాన్ హక్కులు పొందింది. ఈ నదులని తూర్పు, పశ్చిమ నదులు అంటారు. 1960లో చేసుకున్న ధ్వైపాక్షిక ఒప్పందం ప్రకారం.. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. అలాగే, జీలం, చీనాబ్, సింధు నదులపై పాకిస్థాన్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. అయితే, భారత్ ప్రాజెక్టు నిర్మిస్తే పాక్‌కు ఆ నీళ్లు అందకుండా చేయొచ్చని గతంలో భారత్‌లో ఉగ్రదాడులు జరిగిన సమయాల్లోనూ చర్చ కొనసాగింది.
గురువారం మధ్యాహ్నం ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ ఆ సమయంలో కూడా ఈ విషయంపై కొంత వివరణ ఇచ్చారు. పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తున్న మూడునదుల నీటిని భారత్.. త్వరలోనే భారత్ యమునా నదిలోకి మళ్లిస్తుందని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడ్కరీ గురువారం ఓ సమావేశంలో మాట్లాడుతూ… ‘దేశ విభజన తరువాత ఆరు నదుల విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య సర్దుబాటు జరిగింది. దీని ప్రకారం వాటిలో మూడు నదులపై భారత్‌కు హక్కులు ఉన్నాయి. మనం ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే, పాక్‌లోని నదుల్లోకి నీరు ప్రవహించదు. మనం ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఆ నీళ్లన్నీ మన యమునా నదికి మళ్లుతాయి. మనకు మరిన్ని జలాలు అందుబాటులోకి వస్తాయి’ అని వ్యాఖ్యానించారు.