తన పెళ్లి వార్తలపై నిత్యా మీనన్ స్పందించింది. తాజాగా ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనిపై నిత్యా స్పందిస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నిన్నటి నుంచి నా పెళ్లి అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని’ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పేర్కొంది.
కాగా నిత్యా మీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, మాలీవుడ్ స్టార్ యాక్టర్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ నిన్నటి నుంచి పలు మలయాళ వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిత్యా మీనన్ వెబ్ సిరీస్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల భీమ్లా నాయక్‌తో అలరించిన ఆమె తాజాగా మోడ్రన్ లవ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతోంది.