ప్రముఖ నటి అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘నిశ్శబ్ధం’. రచయిత కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్వీటి, మాధవన్ లుక్స్‌తో పాటు ప్రీ టీజర్‌ను చిత్రబృందం ఇప్పటికే విడుదల చేసింది. అంతేగాకుండా నవంబరు 7న స్వీటీ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక తాజాగా అంజలి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసి అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది.
కాగా అమెరికాలోని సియోటెల్ కేంద్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి పవర్‌ఫుల్ క్రైం డిటెక్టివ్ ఏజెంట్ మహాగా కనిపించనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భాగమతి చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీపావళి కానుకగా చిత్రానికి సంబంధించిన ప్రి టీజర్‌ను విడుదల చేసి వాటిని మరింతగా పెంచింది చిత్ర బృందం.