కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈలపై వరాల జల్లు కురిపించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి హామీ లేకుండా రూ. 3 లక్షల కోట్ల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. నాలుగేళ్ల కాలపరిమితితో రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్‌ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రూ. 200 కోట్లు లోపు కొనుగోళ్లకు అంతర్జాతీయ టెండర్లకు అవకాశం లేదన్నారు. ఈపీఎఫ్ పరిధిలోని MSMEలకు జూన్, జులై, ఆగస్టు నెలల పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని తెలిపారు. దీనికోసం రూ. 2,500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో 70 లక్షలకు పైగా ఉద్యోగులు లబ్ది పొందనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ప్రతినెలా చెల్లించే ఈపీఎఫ్‌ను 12 నుంచి 10 శాతానికి తగ్గించినట్టు ప్రకటించారు.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లను ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్లు, ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్లు, నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90 వేల కోట్లు కేటాయించారు. ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేలా ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్, టీసీఎన్‌ను 25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మే 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందన్నారు. రెరా పరిధిలోకి వచ్చే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఊరట కల్పిస్తున్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు.. భవన నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు మరో 6 నెలల సమయం పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పన్నుల ఆడిట్ గడువు ఈ ఏడాది నవంబర్ చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి పరిమితి 25 లక్షల నుంచి రూ. కోటికి పెంచుతున్నట్లు, రూ. 5 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలను సూక్ష్మ పరిశ్రమలుగా గుర్తించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.