దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష ఖరారైన విషయం తెలిసిందే. అయితే దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతూనే ఉంది. దోషులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నిటినీ ఒక్కొక్కటిగా వినియోగించుకోవడంతో శిక్ష అమల్లో జాప్యం జరిగేలా చేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలలోపు నలుగురు దోషులను ఉరితీయాలని కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ చేసింది. అయితే, శిక్ష నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు దోషులు. తాజాగా నలుగురిలో ఒక దోషి ముఖేష్ సింగ్ తనపై జైలులోనే పలుమార్లు లైంగిక దాడి జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పటికే ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముఖేష్ మరో కొత్త డ్రామాకు తెరలేపాడా? శిక్ష అమలు కాకుండా మరికొంత సమయం జాప్యం అయ్యేలా కొత్త ఆరోపణలు తెరపైకి తెస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ముఖేష్. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఎదుట ముఖేష్ సంచలన విషయాలు బయటపెట్టాడు.. తీహార్ జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని, శిక్ష అనుభవిస్తున్న సహ దోషి అక్షయ్ సింగ్ తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, జైలు అధికారుల సహకారంతోనే తనపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించాడు. రాష్ట్రపతికి పెట్టిన క్షమాభిక్ష పిటిషన్‌లో ఈ విషయాలు వెల్లడించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌పై వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. బుధవారం తుది తీర్పును వెల్లడించనుంది.