నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ట్రయల్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. స్టేను ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది. స్టే యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అయితే వారంలోగా దోషులు తమకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
నిర్భయ కేసులో దోషులు ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌ను జవనరి 22నే ఉరితీయాల్సి ఉండగా.. ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందనే కారణంతో ముందుగా శిక్ష అమలు వాయిదా పడింది. ఆ తర్వాత అతడి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాలని ఢిల్లీ ట్రయల్ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. శిక్ష అమలుకు రెండు రోజుల ముందు దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలున్నాయని, అప్పటి వరకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు శిక్ష అమలుపై స్టే విధిస్తూ జనవరి 31న తీర్పు ఇచ్చింది. దీంతో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీన్ని న్యాయస్థానం కొట్టివేసింది.