నటీనటులు: నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, మురళి శర్మ, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: డివివి దానయ్య
దర్శకత్వం: శివ నిర్వాణ
ఈ మధ్య కాలంలో నానికి బాగా కలిసొస్తోంది. తను నటిస్తోన్న ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకుంటుంది. అయితే ఈసారి మరో కొత్త ప్రేమకథతో ‘నిన్ను కోరి’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
ఉమా(నాని) ఉమా మహేశ్వరావు(నాని) వైజాగ్ లో పి.హెచ్.డి చేస్తుంటాడు. తనకు పల్లవి(నివేదా థామస్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడడం అది ప్రేమగా మారడం జరుగుతుంది. బాగా సెటిల్ అయిన తరువాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఉమా. అయితే తనకు ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, వెంటనే ఎక్కడికైనా తీసుకువెళ్లిపోమని అడుగుతుంది పల్లవి. అది కరెక్ట్ కాదని భావించిన ఉమా తనకు పి.హెచ్.డి పూర్తి చేసి ఉద్యోగం సంపాదించడానికి సంవత్సరం సమయం అడుగుతాడు. తన కెరీర్ కోసం ఉమా ఢిల్లీ వెళ్ళిపోతాడు. ఈలోగా పల్లవికి ఇంట్లో వాళ్ళు అరుణ్(ఆది పినిశెట్టి) అనే అబ్బాయితో వివాహం చేయాలని నిర్ణయిస్తారు. తండ్రికి ఎదురుఛెప్పలేని పల్లవి, అరుణ్ ను పెళ్లి చేసుకుంటుంది. అలా విడిపోయిన తరువాత పల్లవి మరోసారి ఉమాను కలుసుకుంటుందా..? చివరకి అరుణ్, ఉమా, పల్లవిల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథలో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా స్పష్టంగా రాసుకున్నాడు. దీంతో సినిమా చూస్తున్నంతసేపు ఎలాంటి డౌట్స్ కలగవు. రొటీన్ ప్రేమ కథల్లా కాకుండా కొంచెం కొత్తగా మెచ్యూర్డ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ప్రేమించే పెళ్లి చేసుకోనక్కర్లేదు.. పెళ్లి చేసుకొని కూడా ప్రేమించొచ్చు, ఒకసారి ప్రేమలో ఓడిపోతే జీవితం లేదని కాదు వాటి విషయాలను సున్నితంగా డీల్ చేశాడు.
త్రికోణ ప్రేమకథల్లో పతాక సన్నివేశాలలో ఎవరో ఒకరు త్యాగం చేయడం, ఒకరికి బాధ మిగలడం జరుగుతుంది కానీ ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పెద్ద ప్లస్ నాని నటన. పంచ్ లు వేస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు. సెకండ్ హాఫ్ లో తన ఎమోషనల్ యాక్టింగ్ తో మరింత ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి తన పాత్రలో సహజంగా నటించాడు. నివేదా థామస్ ప్రేయసిగా, భార్యగా రెండు వేరియేషన్స్ బాగా చూపించింది. ఈ ముగ్గురు కూడా తమ సహజ నటనతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు.
దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా బాగా తెరకెక్కించాడు. అనుభవం లేకపోయినా సబ్జెక్ట్ ను బాగా హ్యాండిల్ చేశాడు. గోపి సుందర్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ మరింత ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే ఇటువంటి సినిమాలు మాస్ ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతాయనేది మాత్రం సందేహం. బి, సి సెంటర్స్ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు.
రేటింగ్: 2.75/5