నిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను వైద్యులు కడుపులోనే మరిచిపోయారు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. మహేశ్వరి (33)అనే మహిళకు మూడు నెలల క్రితం హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. అయితే, గత 15 రోజులుగా తరచూ కడుపునొప్పి రావడంతో రోగి మరోసారి ఆస్పత్రికి రావడంతో విషయం వెలుగు చూసింది. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట రోగి బంధువులు ఆందోళనకు దిగారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కత్తెరను తొలగించేందుకు మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స చేపట్టారు.
మహిళ కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటన దురదృష్టకరమని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ పేర్కొన్నారు. మహిళకు శస్త్ర చికిత్స చేసి కత్తెరను తొలగించామన్నారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించామని తెలిపారు. ఇటువంటి సంఘటన గత 30 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు.