ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వామపక్షాల మహాగర్జన కార్యక్రమం నిర్వహించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విధానాల పరంగా చూస్తే చంద్రబాబు, జగన్‌కు పెద్ద తేడా లేదని విమర్శించారు. టీడీపీ, వైసీపీ పైనే తమ పోరాటమని స్పష్టం చేశారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదికకు నాంది పలికామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మార్పు కోరుకుంటున్నారని, జనసేన పార్టీ కూడా మాతో కలిసి వస్తుందని, త్వరలోనే పీపుల్స్ అజెండా ప్రకటిస్తామని తెలిపారు.
సీపీఎం కార్యదర్శి మధు మాట్లాడుతూ టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడంలో వైసీపీ విఫలమైందన్నారు. మతోన్మాద శక్తి బీజేపీతో వైసీపీ చేతులు కలిపిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేనతోనే కలిసే వెళ్తాయని స్పష్టం చేశారు.
మోడీ పాలనలో దేశంలో 40 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. నోట్ల రద్దు వల్ల 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. చంద్రబాబుకు మోడీ పెద్దన్నఅని.. మోడీ మాట్లాడతారు. చంద్రబాబు అమలు చేస్తారు అని ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే ‘రాష్ట్ర సర్వనాశన సంస్థ’ అని విమర్శించారు. వైసీపీ ఎంపీలు మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడబోరని.. పదవి కోసమే వైసీపీ నాయకుడు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.