అక్టోబరు 15నుంచి రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా పథకం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆశాఖ అధికారులతో తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం జగన్ సమీక్ష నిర్వహించారు. నకిలీ విత్తనాల చలామణిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమాలు జరిగితే జైలుకు పంపేందుకు కూడా వెనకడుగు వేయవద్దని సూచించారు. విత్తన చట్టం తేవాలని, అందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీ జరగాలన్నారు. మంచి సలహాలు ఇచ్చే అధికారులు, సిబ్బందికి సన్మానం చేస్తామన్నారు. రైతులకు బీమా సౌకర్యం సక్రమంగా అందించే బాధ్యత తమదేనన్న సీఎం.. ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూడాలని, రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలని సూచించారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రూ.3వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెడతామని ప్రకటించారు. రైతులకు నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా సాయమందిస్తామని తెలిపారు.