త్వరలో ‘మా’ కుటుంబం ముక్కలు కానుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక వర్గం బాగా హర్ట్ అవుతోంది అంటున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే మా మెంబర్ షిప్ కి రాజీనామా చేసేశారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో గెలిచిన సభ్యులూ ‘మా’ని వీడతారని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రచారం మొదలైంది. ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ‘ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మా) పేరుతో కొత్త అసోసియేషన్ ఉండనుందని సమాచారం. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదం ప్రచారాస్త్రంగా మంచు విష్ణు ప్యానెల్ ప్రచారం చేసింది. తెలుగు నటీనటులు ఉన్న అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా తెలుగువాడినే ఎన్నుకోవాలని పలువురు నటులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీనిపై ప్రకాశ్‌రాజ్ కూడా పలు వేదికల మీద స్పందించారు. తాను తెలుగు వాడిని కాకపోవటం దురదృష్టకరమని అన్నారు. తన తల్లిదండ్రులు తెలుగువాళ్లు కాకపోవటం తన తప్పా? అంటూ వాపోయారు.
ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. దీంతో ప్రాంతీయవాదం ఉన్న ‘మా’లో తాము కొనసాగలేమని అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి సినీ నటుడు నాగబాబు రాజీనామా చేయగా, మరుసటి రోజే ప్రకాశ్‌రాజ్ కూడా అదే బాటలో నడిచారు. ‘అతిథిలా వచ్చాను.. అతిథిలానే ఉంటాను’ అంటూ ప్రకాశ్‌రాజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. చివరిగా ‘ఇప్పుడే మొదలైంది’ అంటూ ప్రెస్‌మీట్ ముగించడంతో ఏదో జరగబోతోందని చిత్ర పరిశ్రమలో టాక్ మొదలైంది. అన్నట్లుగానే ఇప్పుడు మరో అసోసియేషన్ ఏర్పాటుపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో తాను గెలిచి తమ ప్యానెల్ అధ్యక్షుడు ప్రకాశ్‌రాజ్ గెలవకపోవటం దురదృష్టకరమని శ్రీకాంత్ సైతం విచారం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 5గంటల తర్వాత ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ప్రెస్‌మీట్ పెట్టనుండటంతో వారు ఏం మాట్లాడతారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.