బాలీవుడ్ నటి సన్నీ లియోన్.. గతాన్ని గుర్తు చేసుకోలేనని, అది ఓ పీడకలని ఆవేదన వ్యక్తం చేశారు. శృంగార తారగా గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు నటిగా రాణిస్తున్నారు. సన్నీ జీవిత కథతో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ ‘కరణ్‌జీత్ కౌర్- ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ (ఆమె అసలు పేరు ‘కరణ్‌జీత్ కౌర్ వోహ్రా). త్వరలో చివరి సీజన్ ప్రసారం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ గురించి సన్నీ మాట్లాడారు. తన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకున్నారు.
‘నా జీవితంలో చీకటితో కూడిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకోవడం అంత సులభం కాదు. అది ఓ పీడకల. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్నకు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆయన కూడా కొన్ని రోజులకే మృతి చెందారు. తర్వాత నాకు పెళ్లైంది. ఇండియన్ టీవీ షోలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. అన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి. కొన్ని బాధాకర పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. మళ్లీ ఆ గతాన్ని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ‘కరణ్‌జీత్ కౌర్’ షూటింగ్ సమయంలో పాత రోజుల్ని తలచుకుని ఎంతో కుమిలిపోయాను. నేను అలా ఏడుస్తుండటం చూసి నా భర్త (డేనియల్ వెబర్) చాలా బాధపడ్డారు. నన్ను ఓదార్చలేకపోయారు. ఎందుకంటే నా జీవితంలోని ఆ చేదు రోజుల్ని ఆయన మార్చలేరు కదా. తల్లిదండ్రుల్ని కోల్పోవడం నన్ను ఎంతో వేదనకు గురి చేసింది’ అని సన్నీ చెప్పారు.
వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమతుల్యం చేస్తున్నారని ఆమెను ప్రశ్నించగా.. ‘మా ఇద్దరు కుమారులు చాలా చిన్నవారు. నిషాకు పెయింటింగ్ అంటే ఇష్టం. రెండున్నరేళ్ల వయసులోనే తను పెయింటింగ్ బ్రెష్ పట్టుకునే విధానం, చేతులు-కళ్ల కో ఆర్డినేషన్, రంగులు చూసినప్పుడు తను స్పందించే తీరు అద్భుతం. మాకు ఆర్ట్ టీచర్ ఉన్నారు. వారే ఇంటికి వచ్చి నిషాకు పెయింటింగ్ నేర్పిస్తుంటారు. ఈ విషయంలో నిషాను మేం ఒత్తిడి చేయలేదు. తను ఇష్టంగానే నేర్చుకుంటోంది. మేం కేవలం ప్రోత్సహిస్తున్నాం’ అని తెలిపారు.