బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ బలవన్మరణం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. సుశాంత్ మృతికి సంతాపం తెలుపుతూ గతకొన్నిరోజుల నుంచి నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌కు చెందిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల సుశాంత్ ఎన్నో సందర్భాల్లో తీవ్ర మనస్తానికి గురయ్యారని.. చివరికి ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంటున్నారు. దీంతో ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ అంటూ సోషల్‌మీడియాలో వరుస ట్వీట్లు దర్శనమిస్తున్నాయి.
నటన మీద ఉన్న ఆసక్తితో చదువు మధ్యలో వదిలేసి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సుశాంత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడని, అలాంటి వ్యక్తికి బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రోత్సాహం లభించలేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌లోని అగ్రనిర్మాతలు, దర్శకులు.. వారసత్వ నటులకే ఆఫర్స్ ఇచ్చారని, అవార్డుల ఫంక్షన్స్‌లో సైతం వారికే ప్రాధాన్యమిచ్చారంటూ పోస్టులు చేస్తున్నారు. అలాంటివారిని సోషల్‌మీడియాలో అన్‌ఫాలో చేయాలని, వారి సినిమాలను నిషేధించాలని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఇండస్ట్రీలో వారసత్వ విధానం నశించాలని, టాలెంట్ ఉన్న నటీనటులకు ఛాన్స్‌లు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. దీంతో ట్విటర్, ఇన్‌స్టా, ఇతర సోషల్‌మీడియా వేదికల్లో సదరు నటీనటులు, దర్శక నిర్మాతలను నెటిజన్లు అన్‌ఫాలో చేస్తున్నారు.