
Daaku Maharaaj Netflix controversy:
సినిమాలో నటించినా, ప్రమోషన్‌లో కూడా భాగమైనా… ఒక్కసారిగా తన సన్నివేశాలన్నీ కట్ చేయబడ్డాయంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే! ఇదే జరిగింది ఊర్వశి రౌతెలాతో. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమైన నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఆమె భాగాన్ని పూర్తిగా తొలగించేసినట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే, అందుకు సంబంధించిన పోస్టర్‌లో ఊర్వశి రౌతెలా కనిపించలేదు. బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌ల పేర్లు ముద్రించబడ్డా, ఊర్వశి పేరు లేకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది.
సినిమా ప్రమోషన్‌లో బాగా చురుగ్గా పాల్గొన్న ఊర్వశి, బాక్సాఫీస్ వసూళ్లు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సినిమా ₹105 కోట్లు వసూలు చేసిందని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ, సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడిపై స్పందిస్తూ తన డైమండ్ వాచ్‌ను ప్రదర్శించడంతో ఆమెపై నెగటివ్ కామెంట్లు వచ్చాయి. దీనివల్లే నెట్‌ఫ్లిక్స్ ఆమె సీన్స్ తొలగించిందా? అని చర్చ మొదలైంది.
తర్వాత, తన తప్పును సరిదిద్దుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ఊర్వశి క్యారెక్టర్ స్లైడ్‌ను విడిగా పోస్ట్ చేసింది. కానీ అప్పటికే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.
ఈ మూవీ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రిషి, చందిని చౌదరి, ప్రదీప్ రావత్, సచిన్ ఖేడ్‌కర్, షైన్ టామ్ చాకో, విశ్వంత్ దుడ్దంపూడి, ఆడుకలం నరేన్, రవి కిషన్ కీలక పాత్రలు పోషించారు.
సినిమా జనవరి 12, 2025న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. అయితే ఊర్వశి రౌతెలా సీన్స్ తొలగించడం వలన అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. మరి దీనికి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలే కారణమా? లేక వేరే కారణమా? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ALSO READ: PVR INOX కి లక్ష రూపాయలు ఫైన్ ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే