నటీనటులు: హెబ్బా పటేల్, నోయల్, అశ్విన్, పార్వతీశం, రావు రమేష్, తేజస్విని తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
దర్శకత్వం: భాస్కర్ బండి
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’. ట్రైలర్, పోస్టర్స్ తో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు
మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
పద్మావతి(హెబ్బా పటేల్) సిటీలో ఉద్యోగం చేయడానికి వస్తుంది. పద్మావతి అంటే తన తండ్రికి(రావు రమేష్) ప్రాణం. తనేం చేసిన సపోర్ట్ చేస్తూ ఉంటాడు. పద్మావతి కి ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తారు. పెద్దలు కుదిర్చిన వివాహం కాకుండా ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుంది. దీనికోసం సిటీలో గోకుల్(నోయల్), నాని(అశ్విన్), నమో(పార్వతీశం) అనే ముగ్గురు కుర్రాళ్లను సెలెక్ట్ చేసుకొని వారిని తన ప్రేమలో పడేలా చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే ముగ్గురికి పద్మావతి అంటే విపరీతమైన ప్రేమ ఉండడంతో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో.. తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. పద్మావతి ఇలా ముగ్గురు అబ్బాయిలను ప్రేమిస్తుందని తెలిసిన వాళ్ళ అమ్మ సిటీ నుండి తనను ఇంటికి తీసుకువెళ్లిపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది..? పద్మావతి అనుకున్నట్లుగానే ముగ్గురిలో ఒకరిని వివాహం చేసుకుందా..? లేక ఇంట్లో కుదిర్చిన పెళ్లి చేసుకుందా..? ముగ్గురు అబ్బాయిలను ప్రేమించిన తన కూతురిని తండ్రి ఏ విధంగా అర్ధం చేసుకున్నాడు..? ఇటువంటి అంశాలతో సినిమా నడుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
రావు రమేష్, హెబ్బా పటేల్
సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
ఎడిటింగ్
రొటీన్ సన్నివేశాలు
విశ్లేషణ:
రెగ్యులర్ ప్రేమ కథలకు భిన్నంగా ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలను ప్రేమించే కాన్సెప్ట్ ను కొత్తగా రాసుకున్నాడు రచయిత సాయికృష్ణ. రావు రమేష్ పాత్రకు డైలాగ్స్ ను ప్రసన్న కుమార్ అధ్బుతంగా రాశాడు. సాయికృష్ణ అందించిన కథను చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్ భాస్కర్ బండి. అయితే ఫస్ట్ హాఫ్ లో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. హెబ్బా పటేల్ ముగ్గురు అబ్బాయిలను తన వలలో వేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి.
ఇంటర్వల్ బ్యాంగ్ కు ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అశ్విన్, ధనరాజ్ ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. రావు రమేష్ పాత్ర సినిమాలో ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు. కూతురుని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. ఆయన చెప్పే డైలాగ్స్ కూడా బలంగా ఉంటాయి. హెబ్బా తన క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. నోయల్, అశ్విన్, పార్వతీశం ముగ్గురు తమదైన స్టయిల్ లో మెప్పించారు. తేజస్వి, హెబ్బా ఫ్రెండ్ పాత్రలో బాగా నటించింది. ఆమెను తెరపై అందంగా ప్రెజంట్ చేశారు.
శేఖర్ చంద్ర సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రతి పాట సంధర్భానుసారంగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే బావుండేది. ఫస్ట్ హాఫ్ స్లో గా సాగడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని మాత్రమే చెప్పాలనుకున్న దర్శకుడు మిగిలిన అంశాలపై పెద్దగా క్లారిటీ చూపించలేదు. విసుగు పుట్టినా పర్వాలేదు.. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలనుకునే ప్రేక్షకుడు ఈ సినిమాను చూడొచ్చు!
రేటింగ్: 2.5/5