టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషన్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
కథ: వికాస్ (కిరణ్ అబ్బవరం) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. సాఫ్ట్‌వేర్ అమ్మాయి తేజు ( సంజన ఆనంద్) ప్రతి రోజూ విపరీతంగా తాగుతూ ఉంటుంది. వికాస్ ఆమెను తన క్యాబ్ లోనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు. ప్రేమ అనే మాట వింటేనే ఆమె భగ్గున మండిపడుతుండటం అతను గమనిస్తాడు. తాగేసి ఆ మత్తులోనే ఇంటికి వెళ్లే ఆమెపై కొంతమంది రౌడీగాళ్లు కన్నేస్తే, కాపాడే బాధ్యతను కూడా వికాస్ తన భుజాలపై వేసుకుంటాడు. అలాంటి ఓ సంఘటన నుంచి తేజుని రక్షిస్తాడు వికాస్. ఆ తర్వతా ప్రేమపఐ ఆమెకి కోపం రావడానికి, తాగుడికి బానిస కావడానికి కారణం ఏమిటని అడుగుతాడు.
దాంతో తేజు తన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. తల్లిదండ్రులు .. బాబాయ్ – పిన్ని .. అక్కాబావలు .. ఉన్న అందమైన ఫ్యామిలీలో తేజు జీవితం ఆనందంగా గడిచిపోతుంటుంది. ఆమె అంటే తండ్రి (ఎస్వీ కృష్ణారెడ్డి)కి ప్రాణం. ఆ ఇంట్లో యువరాణిగా ఉన్న ఆమెను మరో ఇంటికి మహారాణిగా చేయాలని ఆయన కలలు కంటూ ఉంటాడు. ఆమెకి ఆయన ఒక మంచి సంబంధం చూస్తాడు. అప్పటికే ఒక వ్యక్తిని ప్రేమించిన తేజు, మరి కాసేపట్లో పెళ్లి అనగా అతనితో వెళ్లిపోతుంది. ఆ తరువాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆమె ఫ్లాష్ బ్యాక్ విన్న వికాస్ ఏం చేస్తాడు? అనేదే కథ.
నటీనటులు: కిరణ్ అబ్బవరం తన పాత్రలకు న్యాయం చేశాడు. ఈ సినిమా హీరోయిన్ సంజన ఆనంద్ పాత్ర కీలకం. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్ తండ్రిగా తన పాత్రకు న్యాయం చేశాడు. బాబా మాస్టర్ తనదైన స్టైల్‌లో నవ్వించాడు. మిగిలిన నటులు తమ పరిధి మేరకు నటించారు. మణిశర్మ సంగీతం బాగుంది. మాస్ పాటలకు మంచి స్టెప్పులు వేశాడు.
విశ్లేషణ: కథ కొత్తదేమి కాదు. పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ శ్రీధర్. హీరో – హీరోయిన్ పైనే ఆయన పూర్తిగా ఫోకస్ చేశాడు. ఎస్వీ కృష్ణారెడ్డి పాత్ర సహా ఏ పాత్రను కూడా ఆసక్తికరంగా మలచడానికి ప్రయత్నించలేదు. ఏ సన్నివేశం కూడా మనసుకి పట్టుకోదు. లవ్ .. ఎమోషన్ .. కామెడీ .. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా లోతుగా కనిపించవు.
ఫస్టాఫ్ అంతా కూడా హీరోలేని హీరోయిన్ లవ్ ట్రాక్ నడపడమే ఈ సినిమాకి పెద్ద మైనస్. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. సెకండాఫ్ లో కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ ట్వీస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది.
టైటిల్ : ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’
నటీనటులు : కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, ఎస్వీ కృష్ణరెడ్డి, బాబా భాస్కర్, సమీర్ తదితరులు
నిర్మాత: కోడి దివ్య దీప్తి
నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: శ్రీధర్ గాదె
సంగీతం : మణి శర్మ
హైలైట్స్: సంగీతం
డ్రాబ్యాక్స్: రొటీన్ కథ
చివరిగా: పెద్దగా మెప్పించని ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)