HomeTelugu Big Storiesరివ్యూ: నేను లోకల్

రివ్యూ: నేను లోకల్

నటీనటులు: నాని, కీర్తి సురేష్, పోసాని కృష్ణ మురలి, సచిన్ ఖేడ్కర్, ఈశ్వరి రావు తదితరులు
దర్శకుడు: త్రినాధరావు నక్కిన
నిర్మాత: దిల్ రాజు
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
సంగీతం: దేవి శ్రీప్రసాద్
నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా వస్తుందంటే చాలు అందరూ థియేటర్ లో వాలిపోతారు. అంతగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘నేను లోకల్’. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. కీర్తి సురేష్
హీరోయిన్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:

బాబు(నాని) అతి కష్టం మీద ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. ఆ తరువాత ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన కోసం తను చదివే కాలేజ్ లో ఎం.బి.ఏ చేయాలనే కారణం పెట్టుకొని చేరతాడు. కానీ కీర్తి మాత్రం బాబుని ప్రేమించదు. కీర్తికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి తనకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చిన తన తండ్రి ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. కానీ కీర్తి కూడా రాను రాను బాబుని ఇష్టపడడం మొదలుపెడుతుంది.

ఆ విషయం బాబుకి చెప్పాలని బయలుదేరిన సమయంలోనే కీర్తి తండ్రి సిద్ధార్థ్ వర్మ(నవీన్ చంద్ర) అనే పోలీస్ ఆఫీసర్ ను చూపించి పెళ్లి చేసుకోమని చెబుతాడు. సిద్ధార్థ్ కూడా నాలుగేళ్లుగా కీర్తిని ప్రేమిస్తుంటాడు. తనకోసమే కష్టపడి పోలీస్ ఉద్యోగంలో చేరతాడు. ఆ లక్షణాలు నచ్చే సిద్ధార్థ్ ను తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు కీర్తి తండ్రి. సిద్ధార్థ్ కూడా తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది కీర్తి. మరి ఫైనల్ గా కీర్తి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది..? బాబు, సిద్ధార్థ్ లు తమ ప్రేమను దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు..? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:

ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం వారిలో యోగ్యుడైన వాడికే తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని ఓ తండ్రి భావించడం.. తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కూతురు అనుకోవడం.. చివరకు కథ ఎటువైపు మలుపు తిరిగింది.. ఇలాంటి పాయింట్స్ తో ఇప్పటికే
చాలా సినిమాలు వచ్చాయి. కానీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటే ఎన్ని ప్రేమ కథలైనా.. యూత్ ఖచ్చితంగా చూస్తారు. త్రినాధరావు నక్కిన లవ్ స్టోరీ చిన్న కాన్ఫ్లిక్ట్ తో కథ రాసుకున్నారు. కథ గొప్పది కాకపోయినా.. కథనంలో కొత్తదనం ఉండడం వలన ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు.
రైటర్ ప్రసన్న కథకు పూర్తి న్యాయం చేశాడు. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని అతడు రాసిన డైలాగ్స్ క్లాప్స్ కొట్టిస్తాయి. ముఖ్యంగా చదువు, ప్రేమ విషయాల్లో డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

కూతురు, తండ్రి మధ్య సెంటిమెంట్ ను ఇంకాస్త బలంగా రాసుకుంటే బావుండేది. క్లైమాక్స్ లో కూడా ఏం జరుగుతుందో.. ప్రేక్షకులు ముందుగానే ఊహించేలా ఉంది. చేసేదేమీ లేక తన కూతురు ప్రేమించిన అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయడం ఒకప్ప్తటి నువ్వే నువ్వే సినిమా క్లైమాక్స్ ను తలపిస్తుంది. నాని తన పాత్రలో ఒదిగిపోయాడు. అయినా.. ఇలాంటి పాత్రలు నానికి కొత్తేమీ కాదు.. అవలీలగా నటించగలడు. సప్లీ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్ గా అతడు పలికే డైలాగ్స్ నేటి యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ప్రేమించడానికి కావాల్సింది డబ్బు.. పేరు కాదూ.. అవతల వ్యక్తిని ప్రేమించగలిగే మనసు ఉండాలని క్లైమాక్స్ లో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కీర్తి సురేష్ సినిమాలో చాలా చోట్ల బాగా బొద్దుగా కనిపించింది. కొన్ని ఎక్స్ ప్రెషన్స్ లో ఎలా నటించాలో ఆమె ఇంకా నేర్చుకోవాల్సిందే. అన్నింటికీ ఒకటే ఎక్స్ ప్రెషన్ అన్నట్లుంది. నవీన్ చంద్ర తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సచిన్ ఖేడ్కర్ హీరోయిన్ తండ్రిగా బాగా పెర్ఫార్మ్ చేశాడు. పోసాని కృష్ణమురళి అక్కడక్కడా ఆడియన్స్ ను నవ్విస్తాడు. ఈశ్వరిరావు, రఘు బాబు, రావు రమేష్ తమ పాత్రల పరిధుల్లో ఓకే అనిపించారు.

దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్ తో ఆడియన్స్ ను కత్తిపడేశాడు. చంపేసావే, అరెరె ఎక్కడ అనే పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. విజువల్ గా కూడా పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్స్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తానికి నేను లోకల్ అంటూ వచ్చి నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకొని సెకండ్ హ్యాట్రిక్ కు దగ్గరలోనే ఉన్నాడు.
రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu