HomeTelugu Big Storiesరివ్యూ: నేనే రాజు నేనే మంత్రి

రివ్యూ: నేనే రాజు నేనే మంత్రి

నటీనటులు: రానా, కాజల్, శివాజీరాజా, కేథరిన్ త్రెసా, నవదీప్, అశుతోష్ రాణా తదితరులు 
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్ 
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు 
నిర్మాత: సురేష్ బాబు 
దర్శకత్వం: తేజ
బాహుబలి వంటి భారీ చిత్రం తరువాత రానా నటిస్తోన్న సినిమా కావడంతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
 
కథ:
జోగేంద్ర(రానా) వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంటాడు. జోగేంద్రకు తన భార్య రాధ(కాజల్) అంటే ప్రాణం. తను అడిగిందని సర్పంచ్ గా పోటీ చేసి గెలుస్తాడు. ఇక మెల్లమెల్లగా రాజకీయాలు అలవాటు పడి ఒక్కొక్కరినీ తొక్కుతూ పైకి ఎదుగుతాడు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తుంటాడు. రాజకీయాల్లో పడి ఒకానొక దశలో భార్యను కూడా పక్కన పెట్టే పరిస్థితి కలుగుతుంది. దీంతో తను కావాలో..? సిఎం పదవి కావాలో..? తేల్చుకోమని అడుగుతుంది రాధ.  చివరకు ఏం జరుగుతుంది..? జోగేంద్ర తన ముందున్న రెండు ఆప్షన్స్ లో దేన్ని ఎన్నుకుంటాడు..? జోగేంద్ర ముఖ్యమంత్రి అవుతాడా..? లేదా..? సినిమాలో కేథరిన్ పాత్ర ఎలా ఉండబోతుంది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

 
విశ్లేషణ: 
పాలిటిక్స్ నైపథ్యంలో దర్శకుడు తేజ రాసుకున్న బలమైన ప్రేమ కథను చెప్పిన తీరు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి నుండే సమయం వృధా చేయకుండా దర్శకుడు కథలోకి ఎంటర్ అయిపోయాడు. మారిపోవడం, సినిమా మొదట్లో కుర్రాడిలా, లేతగా కనబడే రానా క్లైమాక్స్ కు వచ్చేసరికి రాటుదేలిపోయి, గంభీరంగా తయారవడం చూస్తే తేజ ప్రధాన పాత్ర ప్రయాణాన్ని ఎంత పక్కాగా రాసుకున్నారో అర్థమైపోతుంది. అతడు జోగేంద్ర పాత్రను డిజైన్ చేసిన తీరుని మెచ్చుకోకుండా ఉండలేం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, రాజకీయాల్లో ఎత్తుకి పైఎత్తు ఎలా వేస్తున్నారనే విషయాలు తెరపై బాగా ఆవిష్కరించాడు. 
సినిమా మొదటి భాగాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగాన్ని ఆస్థాయిలో చూపించలేకపోయాడు. నెగెటివ్ క్లైమాక్స్ కథకు న్యాయంగానే ఉన్నా.. ప్రేక్షకులు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకుంటారనే విషయం చెప్పలేం. ప్రీక్లైమాక్స్ సన్నివేశాలు విసిగిస్తాయి. సెకండ్ హాఫ్ లో హీరో అసెంబ్లీలో ఎమ్మెల్యేలను చంపడం, దానికి ఉరిశిక్ష పడడం వంటి
సన్నివేశాలు లాజిక్స్ కు దూరంగా ఉన్నాయి. 
అయితే జోగేంద్ర పాత్ర మాత్రం సినిమాకు హైలైట్ గా నిలిచింది. రానా ఆ పాత్రలో జీవించేశాడు. తన ఆహార్యాభినయంతో ఆకట్టుకున్నాడు. చీరకట్టులో అచ్చమైన తెలుగింటి ఆడపడుచుగా కాజల్ బాగా సెట్ అయింది. సినిమాలో చాలా అందంగా కూడా కనిపించింది. కేథరిన్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంటుంది. నవదీప్, శివాజీరాజా, అశుతోష్ రాణా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. అనూప్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాలో కొన్ని అనవసరపు సన్నివేశాలను ఎడిట్ చేయాల్సిన అవసరముంది. మొత్తానికి చాలా రోజుల తరువాత దర్శకుడు తేజ ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కూడిన ప్రేమకథతో సక్సెస్ ను అందుకున్నాడు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu