లేడీ సూపర్‌స్టార్ నయనతార… ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కలిసిన నయన్-విఘ్నేష్ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఫిక్స్ అయినట్లు.. కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా వీరి పెళ్లిపై విఘ్నేష్ శివన్ స్పందించాడు. ‘నా ప్రేయసి నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం.
కానీ.. అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్ చేస్తాం. జూన్ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపాడు విఘ్నేష్ శివన్.