యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రి-రిలీజ్ వేడుకను గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించబోతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ వేడుకలోనే విడుదల చేయనున్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి యువహీరో నవీన్ పొలిశెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
నవీన్ పొలిశెట్టి నటించిన ‘జాతిరత్నాలు’ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. చిత్రబృందం ముంబయికి వెళ్లి ఆయనతో ట్రైలర్‌ను విడుదల చేయించింది. దీంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. అలా ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘జాతిరత్నాలు’ మంచి హిట్ కొట్టింది. ఆ కృతజ్ఞతా భావంతో ఇప్పుడు ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ కోసం నవీన్ పొలిశెట్టి వ్యాఖ్యాత అవతారం ఎత్తనున్నాడు. మరోవైపు ఈ కార్యక్రమానికి అభిమానులే అతిథులని.. కొవిడ్ నిబంధనలకు పాటిస్తూ వేడుకలో పాల్గొనాలని చిత్రబృందం, వేడుక నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగానే ఐదు భాషలకు సంబంధించిన సినిమా ట్రైలర్లు విడుదల చేయనున్నారు.
కె.కె.రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందింది. గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్ కీలక పాత్రలు పోషించారు.