‘చంద్రయాన్-2’లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై గట్టిగా ఢీకొట్టిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అయితే ప్రస్తుతం విక్రమ్ ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా నిర్ధరించలేకపోయామని తెలిపింది. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ముందుగా నిర్ధరించిన ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటర్(ఎల్‌ఆర్‌ఓ) కెమేరా తన చిత్రాల్లో బంధించింది. వాటిని నాసా శుక్రవారం విడుదల చేసింది. లక్షిత ప్రదేశం నుంచి 150కి.మీ ప్రాంతాన్ని ఈ చిత్రాల్లో బంధించారు. ఈ చిత్రాలు సెప్టెంబరు 17న తీసినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో చీకటిగా ఉందని.. ల్యాండర్‌ని గుర్తించలేకపోయామని తెలిపారు. అయితే చిత్రాలు తీసిన సమయంలో విక్రమ్ దట్టమైన నీడలో ఉండే అవకాశం లేకపోలేదని వివరించారు. అక్టోబర్‌లో వెలుతురు ఉన్న సమయంలో మరోసారి ఎల్‌ఆర్‌ఓ విక్రమ్ ల్యాండింగ్ ప్రదేశానికి దగ్గరగా వెళ్లనుందని అప్పుడు జాడను కనుగొనే విధంగా మరికొన్ని చిత్రాలు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతాయని వెల్లడించారు.
సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విక్రమ్ జాడను కనుగొనేందుకు ఇటు ఇస్రోతో పాటు అటు నాసా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు విక్రమ్ చివరి క్షణంలో తప్పటడుగులు వేయడానికి గల కారణాలేంటో విశ్లేషించే పనిలో ఇస్రో తలమునకలైంది. అలాగే తదుపరి లక్ష్యం గగన్‌యాన్‌పై దృష్టి సారించింది.