మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం నుంచి టాలీవుడ్ పెద్ద ఎవరు అనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇది చర్చ కాస్తా సద్దుమణిగింది. ఇప్పుడు తాజాగా టికెట్ల రెట్ల సమస్య విషయంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు నరేశ్ చేసిన చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్దన్న మోహన్ బాబు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, మా అందరికి అన్న, అందరికంటే మిన్న మోహన్ బాబు. ఇండస్ట్రీలో గొప్ప హీరోలున్నారు, గొప్ప విలన్లు ఉన్నారు. గొప్ప క్యారెక్టర్ అర్టిస్టులు ఉన్నారు. కానీ అన్నీ కలిసిన ఒకే వ్యక్తి మోహన్ బాబు. ఆయనకు ఆయనే సాటి. రైతు కుటుంబంలో పుట్టి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నాయకుడు మోహన్ బాబు’ అంటూ నరేశ్ వ్యాఖ్యానించాడు. అలాగే ఆయన సినిమా కోసం బతికే వ్యక్తి కాదని, సినిమా కోసమే పుట్టిన వ్యక్తి అంటూ కొనియాడాడు. ప్రస్తుతం నరేశ్ చేసిన ఈవ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.