ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా పలు విమర్శలు సంధించారు. దేవుడి స్క్రిప్టులోనూ అనేక మలుపులు ఉంటాయనేది జగన్ గ్రహించాలన్నారు. దేవుడు స్క్రిప్టు రాస్తూ పూర్తిగా ముగించలేదని, మధ్యలో కామా పెడితే దాన్నే ముఖ్యమంత్రి ఫుల్‌స్టాప్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిని భ్రమరావతి అన్న జగన్.. భ్రమలు తొలగించుకొనేందుకు ఆయనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమమని మీరంటే.. అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని దేవుడు కేంద్రంతో లేఖ రాయించాడు. ఇలాంటి కామాలు చాలానే ఉంటాయి’ అని పేర్కొన్నారు. ‘మీరు అవినీతి అని ఆరోపించిన పట్టిసీమ మోటార్లను మీ చేతే ఆన్ చేయించారు. అడ్డుగోలు అని విమర్శించిన పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఓకే చేయించాడు’ అంటూ ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.