Yatra 2: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున నారా లోకేష్ మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. తన పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాలను కలుపుతూ ఇప్పుడు శంఖారావం పేరుతో యాత్రను చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం పాతపట్నంలో శంఖారావం సభలో పాల్గొన్న లోకేష్ సీఎం జగన్‌పై పలు విమర్శలు చేశారు.
ఎన్నికలకు ముందు జగన్ తీయని కబుర్లు చెప్పారని అధికారంలోకి వచ్చాక అవన్నీ మరిచిపోయారని ఆరోపించారు. ప్రతి ఏటా డీఎస్సీ అని యువతను మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. యువతకు న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
జగన్ ఎక్కడ మాట్లాడినా మీ బిడ్డను.. మీ బిడ్డను.. అంటూ మిమ్మల్ని మరోసారి మోసం చేసేందుకు తీయని కబుర్లు చెప్తున్నాడని ప్రజలు జాలి చూపించొద్దని నారా లోకేష్ సూచించారు. పొరపాటున జగన్ ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా.. మీ భూములు తీసుకుంటాను అంటాడని ఎద్దేవా చేశారు.
కోట్లు ఖర్చుచేసి యాత్ర-2 సినిమా నిర్మించారని.. అది వైసీపీకి అంతిమ యాత్రగా మారిందని నారా లోకేష్ విమర్శించారు. డబ్బులిచ్చి సినిమాకు వెళ్లమన్నా ఎవరూ వెళ్లడం లేదని అన్నారు.
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసీపీ నేతలు బోర్డులు పెడుతున్నారని.. జగన్‌ను తన తల్లి, చెల్లే నమ్మడం లేదని మేము ఎలా నమ్ముతాం అని దుయ్యబట్టారు. జగన్ చెల్లెళ్లు షర్మిల, సునీత ప్రాణహాని ఉందని చెప్పే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జగన్ తన ఇంట్లోని మహిళలకే రక్షణ కల్పించలేకపోతే.. రాష్ట్ర ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తాడని లోకేష్ తీవ్రంగా దుయ్యబట్టారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ కార్యకర్తలు భయపడతారని అనుకున్నారు. బాంబులకే భయపడని కుటుంబం మాది.. పనికిమాలిన కేసులకు భయపడేది లేదని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అవినీతిపై చర్చకు సిద్ధమని జగన్‌కు సవాలు విసురుతున్నా.. ఎవరు ఎంత అవినీతి చేశారో తేలిపోతుంది.. చర్చకు రావాలని అన్నారు.