తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు సంధించారు. జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి … తన తండ్రి చంద్రబాబుపై గతంలో 26 కమిటీలు వేసి అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నించారని లోకేశ్ ట్విటర్‌లో దుయ్యబట్టారు. ఇప్పుడు జగన్ కూడా అదేపనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబుపై అవినీతి మరక అంటించడం మీ తండ్రివల్లే కాలేదు… ఇప్పుడు మీ తరం కాదు’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించి ఛార్జిషీట్లు ఉండడాన్ని జగన్ గుర్తించాలని హితవు పలికారు. నిందితుడిగా జగన్ జైలులో ఉండి వచ్చారని, అలాంటి వ్యక్తి నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం ఏమీ బాగోలేదంటూ ఎద్దేవా చేశారు. వంశధార ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వేసిన విచారణ కమిటీ.. రూపాయి అవినీతి జరగలేదని నివేదిక ఇచ్చిందని, పోలవరంపై హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అందరూ తనలా అవినీతిపరులని ముద్రవేయాలనుకుంటున్న జగన్ కల..కలగానే మిగిలిపోతుందన్నారు.