తెలుగు రాష్ర్టాల్లోని అధికార పార్టీల మధ్య సాగుతున్న ఎత్తుగడల్లో రిటర్న్ గిఫ్ట్ అనే పదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. దీనికి తగ్గట్టుగానే కేసీఆర్ పలు అడుగులు వేశారు. అయితే, తాజా పరిణామానికి రిటర్న్ గిఫ్ట్‌కు లింక్ పెడుతూ ఏపీ మంత్రులు కేసీఆర్‌కు కౌంటర్‌లు ఇస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
సున్నితమైన డాటా దారితప్పుతోందంటూ వైసీపీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం అర్ధరాత్రి మొదలైన ఈ వివాదం ఆదివారం రాత్రికి కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండోరోజు ఆదివారం కూడా తెలంగాణ పోలీసులు ఐటీగ్రిడ్ సంస్థ ఉద్యోగుల నివాసాలలో సోదాలు నిర్వహించారు. పోలీసుల అదుపులో వున్న సంస్థ ఉద్యోగుల ఆచూకీ తెలియచెప్పడంలేదని, వారిని న్యాయమూర్తి నివాసంలోనే విచారించాలని సంస్థ సీఈఓ అశోక్ ఉమ్మడి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసు రెండు తెలుగు ప్రభుత్వాల మధ్య సంచలనంగా మారింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు, పోలీసుల అదుపులో వున్నవారిని సోమవారం ఉదయం 10.30 గంటలలోగా హైకోర్టులో హాజరుపర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఉత్కంఠ తొలగేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ ఎపిసోడ్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ”టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి (వైఎస్ జగన్) తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా… కానీ, డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ని టీఆర్ఎస్ దెబ్బ తీసింది” అని మండిపడ్డారు. ”హై కోర్టు సాక్షిగా దొర గారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాలపై వీఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీల పై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారు అని తేలిపోయింది” అంటూ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు.