ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడలేదని.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు అంగీకరిస్తున్నందుకు ధన్యవాదాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. ‘జాబు రావాలంటే బాబు పోవాలి.. బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు’ అంటూ జగన్ ఎన్నో అబద్ధాలను తన పాదయాత్రలో చెప్పారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,151 మందికి ఉద్యోగాలు కల్పించారని చెప్పారని గుర్తు చేశారు. ఐటీ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని అసెంబ్లీలో జగన్ వివరించినట్లు లోకేశ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఏర్పాటవుతున్న కంపెనీల వివరాలను వైసీపీ నాయకులు బయటపెట్టడం లేదని ఆయన విమర్శించారు. సీఎం జగన్ చెప్తున్న 5.60 లక్షల ఉద్యోగాలతో పాటు చంద్రబాబు హయాంలో పనులు ప్రారంభించి, రాబోయే రోజుల్లో యువతకు అందించబోతున్న మరో 8 లక్షల పైచిలుకు ఉద్యోగాల వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీటిని కూడా వైసీపీ నేతలు తమ ఘనతగా చెప్పుకుంటారేమోనంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.