హీరో నాని కుమారుడు అర్జున్ చాలా అల్లరి చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయన సతీమణి అంజన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అంతేకాదు తనకు చాలా ఇష్టమైన ఫొటో అంటూ.. అర్జున్ పుట్టిన నెల రోజులకు తీసిన అపురూపమైన ఫొటోను షేర్ చేశారు. అందులో బుడతడు నిద్రలో తెగ నవ్వుతూ కనిపించాడు. బాబును ఎత్తుకుని ఉన్న అంజన.. అద్దం ముందు నిలబడి ఫొటో తీశారు. ఈ చక్కటి ఫొటోను ఆదివారం అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు అర్జున్ ఏ మాత్రం కుదురుగా ఉండటం లేదంటూ బాబు చిందులేస్తూ ఆడుకుంటున్న వీడియోను, ఫొటోను షేర్ చేశారు. బాబు తన జీన్స్ కాదంటూ.. పరోక్షంగా అన్నీ నాని పోలికలేనని కామెంట్ చేశారు.
నాని సినీ కెరీర్ ప్రారంభించడానికి ముందే అంజనతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. 2012లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2017లో వీరికి అర్జున్ జన్మించాడు. నాని ‘జర్సీ’ హిట్ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోపక్క ఆయన హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో సుధీర్‌బాబు మరో హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్‌లు.