Nani Upcoming Movies:
నాని నటించిన సరిపోదా శనివారం సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కథ, కథనం భిన్నంగా ఉంటాయని, యాక్షన్ సీన్లు పూర్తిగా కొత్తగా ఉంటాయని నాని చెప్పినప్పటికీ, ప్రేక్షకులు ఆశించినంత కొత్తదనం లేదు అనే చెప్పుకోవాలి. కథలో సరికొత్త ఎలిమెంట్స్ కొంతవరకే ఉండగా, ఫార్ములా మాత్రం పాతదే అని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా తేలిపోయింది.
అయితే మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, సరిపోదా శనివారం చిత్రం నానికి ఉత్తర అమెరికా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. నాని దసరా సినిమాని దాటి, 2.05 మిలియన్ డాలర్ల వసూళ్లతో అతని కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచింది.
అలాగే, తెలుగు రాష్ట్రాల్లో సరిపోదా శనివారం సాధారణ వసూళ్లను మాత్రమే నమోదు చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు సినిమాపై ప్రభావం చూపించాయి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున, సినిమా వసూళ్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ మిశ్రమ ఫలితాల నేపథ్యంలో, నాని తన తదుపరి చిత్రంగా హిట్ 3 చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నాని హీరోగా నటించనున్న హిట్ 3 చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇక నాని దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో రెండవ సినిమాను 2025కు వాయిదా వేశారు. ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.