Nani Hit 3:
సరిపోదా శనివారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాచురల్ స్టార్ Nani.. తాజాగా ఇప్పుడు హిట్ 3 సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాను అని ఆ! అనే సినిమాతో నిర్మాతగా కూడా మారారు.
“నా మనసును కదిలించిన కథలతో సినిమాలు నిర్మిస్తాను. ఏదో ఒక సినిమా నిర్మించి చేతులు దులుపుకొని వెళ్ళిపోయే ఉద్దేశం నాకు లేదు. మంచి కథలు దొరికితే నేనే నిర్మిస్తాను. కానీ అలా నిర్మించే సినిమాల్లో నేను నటించను” ఇది ఆ! సినిమా సమయంలో నాని చెప్పిన మాట. తన మాటకి తగ్గట్టుగానే నాని ఆ! సినిమాలో కనిపించలేదు కానీ కేవలం వాయిస్ మాత్రమే ఇచ్చారు.
ఆ తర్వాత కూడా నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా హిట్ 1, అడవి శేష్ హీరోగా హిట్ 2 సినిమాలు నిర్మించారు నాని. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ రెండు సినిమాలు మంచి విషయాలు అందుకున్నాయి. తాజాగా హిట్ ఫ్రాంచైజ్ లో మూడవ భాగం ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతోంది.
అయితే హిట్ 3 లో హీరోగా నటించడానికి స్వయంగా నాని రంగంలోకి దిగారు. హిట్ 2 క్లైమాక్స్ లోనే నాని హిట్ 3 లో హీరోగా కనిపిస్తారు అని తేలిపోయింది. అనుకున్నట్టుగానే తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. హంటర్స్ కమాండ్ అంటూ సినిమా టీజర్ కూడా విడుదల చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ కూడా అయిపోయింది.
అయితే తను చెప్పిన మాట మీద తానే నిలబడలేదు అని.. నిర్మించే సినిమాల్లో నటించను అని చెబుతూనే.. సొంతంగా నిర్మిస్తున్న హిట్ 3 సినిమాలో హీరోగా చేయడానికి రెడీ అయిపోయారు అని.. కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నానిని హిట్ తెలుగు సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో చూడాలని ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మే 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.