Nani 32: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెలతో ‘Nani 33’ చేస్తున్నాడు. ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చింది. బలగం ఫేమ్ వేణుతో ఎల్లమ్మ సినిమా కూడా నాని చేయనున్నారు. వీటితో నాని హీరోగా సుజీత్ డైరెక్షన్లో ఓ మూవీ చేయాల్సి ఉంది.
అయితే.. నాని – సుజీత్ (Nani 32) సినిమా ప్రారంభం కాకముందే సందిగ్ధంలో పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నానితో భారీ రేంజ్లో యాక్షన్ మూవీ చేసేందుకు దర్శకుడు సుజీత్ కథను సిద్ధం చేసుకున్నారు. స్క్రిప్ట్ నచ్చటంతో నాని కూడా ఓకే చెప్పాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద ఈ డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించేందుకు రెడీ అయ్యారు.
అయితే, బడ్జెట్ అంచనాలు భారీగా పెరగడడంతో ఈ సినిమా మొదట్లోనే సందిగ్ధంలో పడిందని టాలీవుడ్ టాక్. నానితో సినిమా కోసం డైరెక్టర్ సుజీత్ ప్రొడ్యూసర్‌ను భారీ బడ్జెట్ అడిగారని తెలుస్తోంది. అయితే, ఈ చిత్రం కోసం ఆ స్థాయిలో ఖర్చు చేసేందుకు నిర్మాత దానయ్య పునరాలోచనలో పడిన్నట్లు వినికిడి. ప్రస్తుతం నాని మార్కెట్‌ను బట్టి చూస్తే ఆ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉందని, ఆ స్థాయిలో వెచ్చించేందుకు ఆయన ముందుకు రావడం లేదని తెలుస్తుంది.
ఇలా బడ్జెట్ అంచనాలు భారీగా ఉండటంతో నాని – సుజీత్ సినిమాకి ఆదిలోనే హంసపాదు పడింది. అయితే, బడ్జెట్ విషయంపై డైరెక్టర్, మేకర్స్ మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ మూవీ దాదాపు హోల్డ్‌లోనే ఉందని తెలుస్తోంది. మరి నాని – సుజీత్ క్రేజ్ ప్రాజెక్ట్ ఇబ్బందులను దాటి సెట్స్‌పైకి వస్తుందా అనేది చూడాలి.
కాగా నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్టు ఇటీవలే మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.