నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి .. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఏప్రిల్ 3 నుంచి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమారు 26 రోజులుగా అక్కడే చికిత్స అందిస్తున్నా ఫలితం లేకపోయింది. ఆయన మరణవార్తతో అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన జనసేన తరుపున నంద్యాల నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. 2014లో వైసీపీ తరపున ఆయన ఎంపీగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి నంద్యాల సీటు ఆశించి భంగపడ్డ ఆయన చివరకు జనసేనలో చేరారు.
సీఎం చంద్రబాబు సంతాపం
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మూడు సార్లు ఎంపీగా ఎస్పీవై రెడ్డి సేవలు ప్రశంసనీయం.
ఆయన మరణం చాలా బాధాకరం: పవన్ కల్యాణ్
జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి మరణం చాలా బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ, కార్యకర్తల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజకీయాల్లోకి రాకముందు పేదల ఆకలి తీరేలా రెండు రూపాయలకే ఆహారం అందించే కేంద్రాలు నెలకొల్పిన ఎస్పీవై రెడ్డి మూడు దఫాలు లోక్ సభ సభ్యుడిగా నిరుపమానమైన సేవలందించారు. జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన అనుభవం, సేవాతత్పరత సమాజానికి ఎంతో దోహదపడుతాయని మనస్పూర్తిగా ఆహ్వానించాను. ఎస్పీవై రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అని సోషల్ మీడియా ద్వారా స్పందించారు.