చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. హీరో నందమూరి తారకరత్న (39) కన్నుమూశారు. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయ్యింది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు.
ఇటీవలే నారా లోకేష్ నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరు లోని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు. విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది.
ప్రముఖ సీనియర్ నటుడు ఎన్టీఆర్ మనువడైన తారకరత్న 1983లో హైదరాబాద్ లో జన్మించారు. 23 సినిమాల్లో నటించిన ఆయన ‘ఒకటో నంబర్ కుర్రాడు’ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ‘అమరావతి’ సినిమాలో ఆయన అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో విలన్ గా ఆయన నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఇటీవలే 9 అవర్స్ వెబ్ సిరీస్ లో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీ కాబోతున్నారు. తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనే చేరి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలోనూ ఉన్నారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.