టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాబోయే సార్వత్రిక ఎన్నికల బిజీలో ఉన్నాడు. మహానాయకుడు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఇప్పుడు సినిమా గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాడు బాలయ్య. ఎన్నికలు దగ్గరపడుతున్నందున కొద్దిరోజులు పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయించాలనుకుంటున్నాడు. మరోవైపు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. వారసుడి కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. ఎందుకంటే నందమూరి కుటుంబం నుంచి కొత్త హీరో వచ్చి 13 ఏళ్లయింది. నందమూరి వారసులు బాలయ్య, ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్.. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.
వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. మరోవైపు అందరి కుటుంబాల నుంచి వారసులు ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. గత పదేళ్లలో వెల్లువలా ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు నలుగురు వారసులు కూడా వచ్చారు. మెగా ఫ్యామిలీ అయితే తమ కుర్రాళ్లతో ఇండస్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నందమూరి కుటుంబం మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోటు భర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వారసుడు నందమూరి మోక్షజ్ఞ సన్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ.
తండ్రికి తగ్గ తనయుడు.. తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ కుర్రాడు. ఇప్పటికే 21 ఏట అడుగు పెట్టాడు మోక్షజ్ఞ. దాంతో ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు బాలయ్యను ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా బాలయ్య కూడా వచ్చే ఏడాది వారసుడిని పరిచయం చేస్తానంటున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనతో పాటు డ్యాన్సులు.. ఫిజిక్‌పై దృష్టి పెట్టాడు. బాలకృష్ణ డ్యాన్సుల్లో కింగ్.. అలాంటి హీరో వారసుడు అంటే అభిమానులు ఊహించేది డాన్సులు. ప్రస్తుతం దీనిపై కూడా ఫోకస్ చేసాడు మోక్షజ్ఞ. ఇప్పటి వరకు తనయుడి కోసం కథలేవీ వినలేదని చెప్పాడు బాలయ్య. ప్రస్తుతం తాను ఎన్నికలతో పాటు బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నానని.. ఆ తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీపై ఆలోచిస్తానంటున్నాడు ఈ హీరో.