నందమూరి బాలకృష్ణ ఆహాలో ఓ టాక్ షో నిర్వహిస్తున్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో లాంచ్ అయ్యింది. కొద్దిసేపటి క్రిత్రం ప్రారంభమైన ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ షోలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి, ఆహా ఓటీటీ మాధ్యమం సీఈఓ అజిత్ ఠాకూర్ కు, నా అభిమానులకు, ప్రేమ, అభిమానం, వాత్సల్యం అందిస్తున్న తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళకు నమస్కారం. అన్ని జోనర్ల సినిమాలను ఆదరిస్తున్న ఘనత తెలుగు ప్రేక్షకులకే చెందుతుంది. ‘ఆహా’ అల్లు అరవింద్ మానసిక పుత్రిక. ఆరితేరిన ఎన్నో దిగ్గజ ఓటిటి సంస్థలు ఉండగా, దీన్ని ప్రారంభించి నిలబెట్టిన ఘనుడు అల్లు అరవింద్.
పొట్టివాళ్లకు పుట్టెడు బుద్ధులు అని అంటారు. ఆయనతో ఎందుకు అంత సన్నిహితంగా మాట్లాడతానంటే అల్లు అరవింద్ గారికి మా కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ది గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారి అబ్బాయి. నా చిన్న చిన్నప్పుడు మద్రాస్ వెళ్ళినప్పుడు మా ఇంట్లోకి నేరుగా వెళ్లి, మా అమ్మగారితో టీ పెట్టించుకుని, బండోడికి ఏమన్నా ఉన్నాయా ? మోయడానికి ? అనే వారు. అలాంటి చనువు ఇండస్ట్రీలో ఒక్క అల్లు రామలింగయ్య గారికి మాత్రమే ఉంది.. అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ వెండితెరపై నటుడేమో కానీ, నిజ జీవితంలో కాదు. భావోద్వేగాలను దాచుకోరు. కోపం, బాధ, ప్రేమ, నవ్వు ఏదైనా ఉన్నది ఉన్నట్లు చూపిస్తారు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఒకరోజు ‘ఆహా’ టీమ్‌తో కలిసి ఏదో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణతో షో చేస్తే ఎలా ఉంటుంది’ అని అన్నాను. అందరూ అరుపులు, ఈలలు వేశారు. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేశా. ఆయన కూడా ఓకే అన్నారు. అలా ఈ షో పట్టాలెక్కింది.
ఇక ఆహాకు 1.5 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ లక్ష్యం. పెద్ద పెద్ద సంస్థలు కూడా పొందలేని నెంబర్లు ‘ఆహా’ కు వస్తున్నాయి. ఇది తెలుగువారి ఘనత. మనవాళ్లు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక గౌరవంతో చూస్తున్నారు. అన్ని పరిశ్రమలకన్నా తెలుగు పరిశ్రమ గొప్పదని బాలీవుడ్ వాళ్లకు అనిపించింది. అందుకు కారణంగా ప్రేక్షకులు అందించే ప్రోత్సాహమే. అతి పెద్ద బడ్జెట్ సినిమాలు ఇక్కడే తీస్తున్నారు. ఎందుకంటే తెలుగువారి సినిమాలను దేశవ్యాప్తంగా చూస్తున్నారు. తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా ‘బాహుబలి’ ఎంతో గౌరవాన్ని తెచ్చింది. అలాంటి గౌరవాన్ని నిలబెట్టేందుకే ‘ఆహా’ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా అని అల్లు అరవింద్ అన్నారు.