సినిమా టిక్కెట్ల ధరల విషయంపై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఇటీవల ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది త్రివిక్రమే చేశారని అభిప్రాయపడిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆ ట్వీట్ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా త్రివిక్రమ్ ట్వీట్‌ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ స్పందించింది. త్రివిక్రమ్‌కు ఎలాంటి సోషల్‌మీడియా అకౌంట్స్ లేవని.. ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ తమ నిర్మాణ సంస్థ అధికారిక ఖాతా నుంచే వస్తాయని తెలిపింది.
‘‘దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే అధికారిక ప్రకటనలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ట్విటర్ ఖాతాల ద్వారానే బయటకు వస్తాయి. ఎందుకంటే, ఆయనకు ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఖాతాల్లేవు. ఆయన పేరు, ఫొటోలతో ఉన్న ఖాతాల నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చినా దయచేసి నమ్మకండి’’ అంటూ ఏపీ సీఎంవో, మంత్రి పేర్ని నాని ఖాతాలను నిర్మాణ సంస్థ ట్యాగ్ చేసింది.