Nagarjuna reaction to N Convention center demolition:
ఉదయం నుంచి అక్కినేని నాగార్జున పేరు భారతంలో వినిపిస్తూనే ఉంది. Hydraa వారు గత కొద్దిరోజులుగా హైదరాబాదులో ఉన్న అక్రమ నిర్మాణాలను వరుసగా కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తుమ్మిడి కుంట చెరువు దగ్గరలో పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాగార్జున N Convention హాల్ ను కూడా అధికారులు కూల్చివేశారు.
ఆ 10 ఎకరాల్లో మూడున్నర ఎకరాలు కబ్జా చేసిన స్థలం అంటూ దాన్ని కూల్చివేశారు. తాజాగా ఇప్పుడు ఈ విషయం మీద సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నోరు విప్పారు. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ తో దీని గురించి క్లారిటీ ఇచ్చారు.
కూల్చివేత మీద ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున కోర్టుని ఆశ్రయిస్తాను అని చెప్పుకొచ్చారు. ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేస్తూ.. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసారని.. అది చట్టరీత్యాన్ని నేరం అని పేర్కొన్నారు.
“కొన్ని వాస్తవాలను మీకు తెలియజేయడం కోసం ఈ ప్రకటన చేయడం సరైనది అని నాకు అనిపించింది. ఎన్ కన్వెన్షన్ ఉన్న స్థలం మొత్తం పట్టాభూమి. అందులో ఒక్క అంగుళం కూడా ఆక్రమణకి గురి అయినది కాదు. ప్రైవేట్ స్థలంలో దాన్ని నిర్మించాము. గతంలో నోటీసులు వచ్చిన సమయంలో కోర్టు దానిమీద స్టే విధించింది. కానీ ఇప్పుడు చట్ట విరుద్ధంగా అధికారులు అక్రమానికి పాల్పడ్డారు” అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాగార్జున.
అసలు కేసు ఇంకా కోర్టులోనే ఉన్నప్పుడు ఇలా చేయడం పద్ధతి కాదు. ఒకవేళ నాకు వ్యతిరేకంగా కోర్టు తీర్పును ఇస్తే.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఆ భవనాన్ని కూల్చి వేయడానికి నేను ముందు ఉండేవాడిని. కానీ కేసు ఇంకా కోర్టులో ఉన్నప్పుడు మేము కబ్జాలు చేసాము అని తప్పుడు అభిప్రాయాన్ని పోగొట్టడమే మా ఉద్దేశం” అని కూడా చెప్పారు నాగార్జున.
అంతేకాకుండా ఈ విషయంలో కోర్టుని ఆశ్రయిస్తాము అని.. తప్పకుండా కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలియజేశారు నాగార్జున. ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ వైరల్ గా మారింది.