టాలీవుడ్ ప్రేమ జంట సమంత- నాగచైతన్య విడిపోయి మూడు నెలలు పూర్తైనా ఇప్పటికీ అది హాట్‌టాపిక్‌గా ఉంది. వారు విడిపోవడానికి నాగార్జున, అతడి కుటుంబం కూడా ఓ కారణమేనంటూ ఆ మధ్య కొన్ని వార్తలు వెలువడగా దానిపై కింగ్ నాగ్ తీవ్రంగానే స్పందించాడు. తనపై అసత్య వార్తలు రాసినా పట్టించుకోను కానీ తన ఫ్యామిలీ గురించి నెగెటివ్‌గా రాయడం బాధించింది అని చెప్పుకొచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మరోసారి ఈ విడాకుల గురించి స్పందించాడు. చైతూ నుంచి సమంతే మొదటగా విడాకులు కోరిందని వెల్లడించాడు. విడాకుల ప్రయత్నాలు తొలుత ఆమెనే మొదలుపెట్టిందని, ఆమె నిర్ణయాన్ని గౌరవించి చై విడాకులకు అంగీకరించాడని తెలిపాడు. నిజానికి చైసామ్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారన్న నాగ్.. నాలుగేళ్ల వివాహబంధంలో విడిపోయేటంత పెద్ద సమస్యేంటో తనకు ఇప్పటికీ తెలియదని పేర్కొన్నాడు.
గతేడాది ఇద్దరూ నూతన సంవత్సర వేడుకలను కలిసే జరుపుకున్నారని, ఆ తర్వాతే వారి మధ్య పొరపచ్చాలు వచ్చాయని తెలిపాడు. కానీ ఈ విడాకుల విషయంలో చై తన గురించి, కుటుంబ పరువు, మర్యాదలు ఏమవుతాయోనని ఆందోళన చెందాడని నాగార్జున చెప్పుకొచ్చాడు.