ఎపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు విజయవాడకు వచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. గురువారం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లిన చిరంజీవి… తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, గన్నవరం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇస్తూ.. ‘సినిమా అంశాలపై సీఎంతో చర్చించేందుకు విజయవాడ వచ్చా. సినీ పరిశ్రమకు చెందిన బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చా అన్నారు. ఈ భేటీపై సినీనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. చిరంజీవి తన ఒక్కరికోసమే వెళ్లలేదని, తమ అందరి కోసమే ఏపీలోని తాడేపల్లి వెళ్లి జగన్ తో సమావేశమయ్యారని నాగార్జున చెప్పారు.
తాను నటించిన బంగార్రాజు సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో జగన్ వద్దకు తాను వెళ్లలేదని ఆయన తెలిపారు. జగన్‌తో సమావేశం ఉందని తనకు చిరంజీవి వారం రోజుల క్రితమే చెప్పారని ఆయన అన్నారు. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నాగార్జున చెప్పారు.