పేరుకే పవన్ కల్యాణ్ తనకు తమ్ముడని, చెప్పాలంటే అందరిలాగే తనకు ఆయన నాయకుడని అంటున్నారు నాగబాబు. జనసేనలో చేరిన సందర్భంగా నాగబాబుకు సంబంధించిన ప్రెస్‌నోట్‌ను జనసేన ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ‘పవన్ కల్యాణ్ నాకూ నాయకుడే. నేను ఎత్తుకుని ఆడించిన తమ్ముడు పవన్ ఇప్పుడు గొప్ప నాయకుడిగా ఎదిగాడు. గొప్ప వ్యక్తిత్వం కల్యాణ్‌బాబుకు ఉంది. ఆయన వ్యక్తిత్వం జనసేనలో ఉన్న చాలా మంది కంటే నాకే ఎక్కువ తెలుసు. తమ్ముడిని ఓ నాయకుడిగా చూడాలనుకున్నా. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు నమ్మలేదు. పేరుకే ఆయన నాకు తమ్ముడు. అందరిలా నాకూ పవన్ నాయకుడే. పార్టీలో చేరకముందే పవన్ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమయ్యాను. తమ్ముడు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకి వెళ్తాను’ అన్నారు.
నాగబాబు తనకు రాజకీయ గురువని, తనలో రాజకీయ చైతన్యం నింపిన వ్యక్తని అంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకువస్తున్నామని, ప్రజాతీర్పు కోసం ధైర్యంగా ఎన్నికల రణక్షేత్రంలో పోటీకి నిలబడుతున్నట్లు వెల్లడించారు. ‘నాగబాబు అన్నయ్యకి రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీలోకి దించుతున్నాం. అన్నింటినీ వదులుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా తనదైన జీవితం గడుపుతున్న వ్యక్తి నా ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన్ను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను’ అని తెలిపారు.