17 రాష్ర్టాలకు చెందిన 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుండటంతో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా తెరపైకి వచ్చింది. చిరంజీవిని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు.
చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని నాగబాబు అన్నారు. అన్నయ్యకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని. కళారంగానికే జీవితం అకింతం చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తప్పుడు వార్తలతో మెగా అభిమానులు, జనసైనికుల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయొద్దంటూ నాగబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నయ్య చిరంజీవికి ఒక రాజకీయ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడైన నాగబాబు స్పష్టత ఇస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోను పోస్టు చేశారు. “చిరంజీవి గారు రాజకీయాలు వద్దనుకున్నారు. ఆయన కావాలనుకుంటే దేశంలో ఏ పార్టీ అయినా ఘనస్వాగతం పలికి రాజ్యసభ సీటు ఇస్తుంది. రాజ్యసభ సీటు కోసం వెళ్లాల్సిన అవసరం అన్నయ్యకు లేదనేది నా అభిప్రాయం. ఒకవేళ ఆయనకు అలాంటి ఆలోచనే ఉంటే తన అభిప్రాయాన్ని నాతో చెప్తారు. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు, పల్లాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానమైన కేంద్రమంత్రి పదవిని అలంకరించారని పేర్కొన్నారు.