Naga Vamsi reacts on Guntur Karam trolls: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. సంక్రాంతి (జనవరి 12) బరిలో నిలిచిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్లు బాగానే రాబట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టులేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని కొన్ని విషయాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది.
ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన విమర్శలపై నిర్మాత నాగవంశీ చాలా రోజులుగా సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‍కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాలోని లాజిక్‍ల గురించి చర్చించారు. తాజాగా ఓ రివ్యూవర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
పెద్ద హీరోల సినిమాలకి లాజిక్‌తో పని లేదని.. అలాంటి చూసేవాళ్లు సినిమాలకి రివ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదని నాగ వంశీ అన్నారు. ఇక గుంటూరు కారం సినిమాపై అంత నెగెటివిటీ రావడానికి కూడా రివ్యూలే కారణమని ఫైర్ అయ్యారు. అయినా ఎన్నో గొప్ప సినిమాలు తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వ్యక్తిని విమర్శించే హక్కు మీకెక్కడిదంటూ ప్రశ్నించారు. సినిమా అనేది వినోదం కోసం తీస్తామనే విషయాన్ని కూడా గమనించాలన్నారు.
“సలార్ సినిమాలో ప్రభాస్ లాంటి కటౌట్ ఫైట్స్ చేస్తుంటే ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ ఆ సినిమాలో కూడా లాజిక్స్ లేవంటూ చాలా మంది కామెంట్ చేశారు. మరి ఆ చిత్రం అన్ని కోట్లు కలెక్ట్ చేసింది కదా మరి వాళ్ల అభిప్రాయం తప్పా?. ఇక ‘గుంటూరు కారం’లో కూడా హీరో తరచుగా హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. దీనికి కూడా అయినా అలా వెంటనే హైదరాబాద్ ఎలా వెళ్లిపోతున్నాడంటూ పిచ్చి లాజిక్స్ లాగారు. ఇలా మాట్లాడే వాళ్ల కోసం గుంటూరు నుంచి మొదలయ్యే మూడున్నర గంటల జర్నీని మూవీలో చూపించలేం కదా.
ఇక ఈ సినిమాలో మాస్ సీన్స్ లేవని, త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని ఏవోవే చెప్పారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక సినిమా చాలా బావుందంటూ నాకు ఎంతోమంది మెసేజ్ చేశారు. అయినా సినిమాను వినోదం కోసమే తీస్తామనే సంగతిని అందరూ గమనించాలి. ఇక ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న త్రివిక్రమ్ లాంటి వ్యక్తికి సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. అయినా అలా కామెట్ చేసే వారికి ఆ అర్హత ఉందా?” అంటూ నాగ వంశీ మాట్లాడారు.
“ఇక రివ్యూవర్లు, మీడియా చేసే ఎంత చిన్న పని అయినా అది ఫ్యాన్స్‌కి హర్టింగ్‌గా ఉంటుందనుకుంటే మేము రియాక్ట్ అవుతాం. అది మా బాధ్యత. అలా చేయకపోతే ఫ్యాన్స్ అంతా మీరేం పీకుతున్నారంటూ మమ్మల్ని తిడతారు. అందుకే సినిమాను డీగ్రేడ్ చేసేలా ఎవరు మాట్లాడినా నేను రియాక్ట్ అవుతాను. అదే విధంగానే గుంటూరు కారం సినిమాపై కూడా రియాక్ట్ అయ్యాను. అయినా గుంటూరు కారం సినిమా విషయంలో అందరూ చాలా అతి చేశారు.” అంటూ నాగ వంశీ చెప్పారు.
గుంటురూ కారం సినిమాలో మహేశ్ బాబు హీరోగా నటించగా.. హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి చేశారు. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, సునీల్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. హాసినీ హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.