హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఏఐ ఆధారంగా తయారుచేసిన ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటీష్ ఇండియన్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ కు చెందిన ఒరిజినల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ చర్యను తప్పుపట్టారు. రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందించడం గమనార్హం. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ హీరో నాగచైతన్య స్పందించాడు. టెక్నాలజీ ఎలా దుర్వినియోగం అవుతోందో చూస్తుంటే చాలా నిరుత్సాహంగా ఉందని నాగచైతన్య అన్నాడు.
భవిష్యత్తులో ఈ దుర్వినియోగం ఏ స్థాయికి పోతుందో అని ఆలోచిస్తేనే భయం కలుగుతోందని చెప్పాడు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇలాంటి చర్యల వల్ల బాధితులుగా మారే వారిని రక్షించేందుకు కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. రష్మికకు బలం చేకూరాలని ఆకాంక్షించాడు.