నాగచైతన్య – సాయిపల్లవి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడినా ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి సన్నగిల్లలేదు. మరి అందుకు తగ్గట్టుగా సినిమా ఉందా? ప్రేమికులుగా నాగచైతన్య, సాయిపల్లవి ఎలా మెప్పించారు? అసలు ఈ సినిమా కథేంటి?
కథ: రేవంత్ (నాగచైతన్య) జీరో నుంచి జీవితాన్ని మొదలు పెట్టిన ఓ మధ్య తరగతి కుర్రాడు. హైదరాబాద్‌లో జుంబా సెంటర్ నడుపుతుంటాడు. చిన్నప్పటి నుంచి ఊళ్లో వివక్ష చూపించడంతో, బాగా స్థిరపడి ఉన్నతంగా బతకాలనేది తన కల. మౌనిక (సాయిపల్లవి) బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగ వేటలో హైదరాబాద్‌కి చేరుకుంటుంది. కానీ, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు. దాంతో రేవంత్ జుంబా సెంటర్‌లో డ్యాన్సర్‌గా చేరుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. మౌనిక ఓ పెద్దింటి అమ్మాయి. ఆ ఇద్దరి పెళ్లికి కులం అడ్డొస్తుంది. మరి రేవంత్, మౌనిక కలిసి బతికేందుకు ఎలాంటి సాహసం చేశారు? ఆ క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? మౌనికకి తన ఇంట్లోనే ఓ పెద్ద సమస్య ఉంటుంది. అదేంటి? దాన్ని ఎలా పరిష్కరించారనేది మిగతా కథ.
నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి నటన చిత్రానికి ప్రధానబలం. వారిద్దరూ రేవంత్, మౌనిక పాత్రల్లో ఒదిగిపోయారు. మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తూ నాగచైతన్య పలికించిన భావోద్వేగాలు, ఆయన పలికిన తెలంగాణ యాస పాత్రకి జీవం పోసింది. ఏదో సమస్యతో బాధపడుతున్న ఓ యువతిగా, ఏదైనా సాధించాలనే తపన ఉన్న నేటితరం అమ్మాయిగా సాయిపల్లవి చక్కటి అభినయం ప్రదర్శించింది. జుంబా నేపథ్యంతో కూడిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి చేసిన డ్యాన్సులు కూడా అలరిస్తాయి. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని, ఉత్తేజ్ కీలక పాత్రల్లో కనిపించి చక్కటి అభినయం ప్రదర్శించారు. ‘నీ చిత్రం చూసి’, ‘ఏవో ఏవో కలలే’ పాటల చిత్రణ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.
విశ్లేషణ: సున్నితమైన అంశాల్ని స్పృశిస్తూ హృద్యమైన భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తుంటారు శేఖర్ కమ్ముల. ఈసారి మరో అడుగు ముందుకేశారు. కులంతోపాటు ఇళ్లల్లో అమ్మాయిలపై జరిగే లైంగిక హింస వంటి సంక్లిష్టమైన అంశాల్ని స్పృశిస్తూ ప్రేమకథని తీశారు. బయటికి చెప్పడానికి, మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడని లైంగిక దాడుల గురించి ఓ ప్రేమకథ ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం మంచి పరిణామం. శేఖర్ కమ్ములలాంటి దర్శకుడు ఈ తరహా అంశాల్ని తెరపై చూపిస్తే మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు ఉంటాయి. సున్నితమైన ఈ అంశాన్ని తెరపై అంతే సున్నితంగా ఆవిష్కరించారు. హీరో జీవితాన్ని పరిచయం చేస్తూ నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. మధ్య తరగతి కుర్రాడి కష్టాలు… తన కలల్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. అదే సమయంలో కథానాయిక తన కలల్ని సాకారం చేసుకోవడానికి హైదరాబాద్ చేరుకుని చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఆమెకి ఎదురయ్యే ఇబ్బందులు హత్తుకుంటాయి.
ఫస్ట్‌హాఫ్ మొత్తం శేఖర్ కమ్ముల మార్క్ సెన్సిబిలిటీస్‌తో సరదాగా సాగుతుంది. ద్వితీయార్ధంలో అసలు ప్రేమకథ మొదలవుతుంది. రేవంత్, మౌనిక ప్రేమకి ఎదురయ్యే సవాళ్లు, ఊళ్లో పరిస్థితులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. కథ చివరి దశకు చేరుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు మనసుకు భారంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మౌనికకి తన ఇంట్లోనే ఎదురైన సమస్య గురించి చెప్పే సన్నివేశాలు మింగుడు పడనిరీతిలో సాగినా… అవి ఆలోచన రేకెత్తిస్తాయి. సమాజానికి ఓ మంచి సందేశాన్నిస్తాయి. పతాక సన్నివేశాలు పరువు – ప్రేమ నేపథ్యంలో సాగే సినిమాల్నే గుర్తు చేస్తాయి.
టైటిల్ : లవ్‌స్టోరి
నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు, రావు రమేశ్, పొసాని కృష్ణ మురళి తదితరులు
నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు
దర్శకత్వం:శేఖర్ కమ్ముల
సంగీతం : పవన్ సీహెచ్
హైలైట్స్: హీరో -హీరోయిన్‌లు
డ్రాబ్యాక్స్: అక్కడక్కడా నెమ్మదించే కథ
చివరిగా: మనసుకు హాత్తుకునే ‘లవ్‌స్టోరి’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)