Naga Chaitanya Dual Role:
కెరియర్ మొదట్లో కమర్షియల్ సినిమాలు చేసిన అక్కినేని నాగచైతన్య తనకంటూ ఒక గుర్తింపు వచ్చిన తరువాత మాత్రం.. ఏదో ఒక కొత్తదనం ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటూ.. తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తున్న నాగచైతన్య.. ఈ మధ్యనే దూత అనే హారర్ సిరీస్ లో కూడా నటించి అందరినీ మెప్పించారు.
ప్రస్తుతం నాగచైతన్య తండెల్ సినిమాతో బిజీగా ఉన్నారు. లవ్ స్టోరీ సినిమాలో హీరో నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి ఈ సినిమాలో కూడా హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష.. అనే హారర్ త్రిల్లర్ తో మంచి పేరు అందుకున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు. పైగా తనకి చెప్పిన కథ కూడా బాగా నచ్చడంతో నాగచైతన్య వెంటనే కార్తీక్ కి అవకాశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇప్పటిదాకా నాగచైతన్య ఎప్పుడు డ్యూయల్ రోల్ చేయలేదు. సవ్యసాచి సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసినప్పటికీ.. డ్యూయల్ రోల్లో కనిపించడం ఇదే మొదటిసారి.
గతంలో నాగర్జున డ్యూయల్ రోల్ చేసిన హలో బ్రదర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్య కూడా ఇప్పుడు డ్యూయల్ రోల్ తో అలానే హిట్ అందుకుంటాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డ్యూయల్ రోల్ అంటే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. అయినప్పటికీ కథ, స్క్రీన్ ప్లే బాగుంటే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో కూడా లవ్ స్టోరీ కీలకంగా ఉంటుందట. ఇందులో నాగచైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఎప్పుడో 2014లో ఒక లైలా కోసం సినిమాలో కలిసి నటించిన ఈ జంట మళ్ళీ ఒక దశాబ్ద కాలం తర్వాత సినిమా చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అక్టోబర్ నవంబర్లో ఈ సినిమా సెట్స్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.