కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అనుభవం ఉన్న నాయకుడైతే బాగుంటుందనే ఉద్దేశంతోనే 2014లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. చంద్రబాబు, ఆయన పార్టీకి మద్దతుగా నిలిచారని సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. జనసేన-టీడీపీ ఇంకా కలిసే ఉన్నాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
‘కొత్త రాష్ట్రం కాబట్టి అప్పట్లో సీనియర్ నాయకుడైతే సమర్థంగా నడపగలరన్న ఉద్దేశంతో చంద్రబాబుకు పవన్ మద్దతు తెలిపారు. ఆ సమయానికి కల్యాణ్‌బాబుకు కనిపించిన క్లీన్ పర్సన్ చంద్రబాబు. అలా అని ఆయనపై కూడా ఆరోపణలు లేవని కాదు. పైగా అప్పటికే వైసీపీ అధినేతపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో టీడీపీని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. అలా చేసినందుకు చాలామంది రకరకాలుగా మాట్లాడారు. డబ్బులు తీసుకున్నారని, ప్యాకేజీ మాట్లాడుకున్నారని ‘సి’ గ్రేడ్ కామెంట్లు చేశారు. ఇలాంటివి మేం అస్సలు పట్టించుకోం. ఇక్కడ ఓ విషయం చెప్పదలుచుకున్నా.. ప్రపంచమంతా మనల్ని చెడ్డవాడు అన్నా ఫర్వాలేదు. అద్దం ముందు నిలబడి, మన ముఖం మనం చూసుకున్నప్పుడు ‘నువ్వు చెడ్డవాడివి కాదురా’ అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. మనం తప్పు చేయనప్పుడు ఈ సమాజం అంతా చెడ్డవాడు అన్నా సరే! మన అంతరాత్మకు నిజం తెలుసు. కల్యాణ్‌బాబు అంతరాత్మకు భయపడతారు గానీ, ఇలాంటి పిచ్చి కామెంట్లకు భయపడరు. వైసీపీ వాళ్లు కూడా తమ ఎన్నికల వ్యూహంలో భాగంగా కల్యాణ్‌బాబుపై చాలా వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే ఆయన బలమైన వ్యక్తిగా మారుతున్నారని తెలిసిందో అప్పటి నుంచి మళ్లీ టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని పాత పాటే పాడారు. ఆ వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని మేం చాలా ప్రయత్నించాం. మీడియా సపోర్ట్ కూడా వాళ్లకే ఉంది. మరోపక్క టీడీపీ వాళ్లు కూడా తమకు లాభిస్తుందని మాట్లాడకుండా ఉండిపోయారు. నేను ఇచ్చిన సమాధానంతో వాళ్లు సంతృప్తి చెందుతారని అనుకుంటున్నా. అలా కాని పక్షంలో 2024లో చూసుకుందాం!’ అని చెప్పుకొచ్చారు.