‘మా’ ఎన్నికలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. నటుడు మోహన్ బాబు వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చిస్తూ ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు నేతృత్వంలో గత నెలలో జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు వ్యాఖ్యలు చేశారు. గతంలో మా అధ్యక్షులుగా పనిచేసిన వారు మా అసోసియేషన్ కోసం కొన్న బిల్డింగ్‌ను తక్కువ ధరకు ఎందుకు అమ్మేశారు, సినిమా పెద్దలు అప్పుడు ఎందుకని పెదవి విప్పలేదు అని మోహన్‌బాబు ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘బిల్డింగ్ కొనుగోలు చేసిన సమయంలో నేనే అధ్యక్షుడిగా ఉన్నాను. సినిమా పెద్దల సూచనలు.. అప్పుడు ఉన్న అవసరాలు దృష్టిలో ఉంచుకుని రూ.71.73 లక్షలతో భవనాన్ని కొనుగోలు చేశాం. ఇంటీరియర్ డిజైన్ కోసం మరో రూ.3 లక్షలు వెచ్చించాం. 2006-08 వరకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. 2008లో అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత ‘మా’ వ్యవహరాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదు. ‘మా’ అభివృద్ధికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చాను. బిల్డింగ్ అమ్మకం వ్యవహారమంతా నరేశ్, శివాజీ రాజాకే తెలుసు. శివాజీరాజా అధ్యక్షుడిగా నరేశ్ కార్యదర్శిగా ఉన్నప్పుడు బిల్డింగ్ బేరం పెట్టి రూ.30 లక్షలకే దాన్ని అమ్మేశారు. కాబట్టి ‘అతితక్కువ ధరకు బిల్డింగ్ ఎందుకు అమ్మేశారు?’ అని నరేశ్‌ని అడగండి. నేను కూడా అదే విషయంపై నరేశ్‌ని ప్రశ్నిస్తాను. బిల్డింగ్ అమ్మకం వ్యవహరం గురించి మళ్లీ నాపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తాను’’ అని నాగబాబు తెలిపారు.