ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన హయాంలో ప్రభుత్వ సలహాల కోసమే రూ.680 కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసమే రూ. 140 కోట్లు ఖర్చు చేయడం విడ్డూరం అని అన్నారు.
సీఎం జగన్ తన చుట్టూ సలహాదారులను పెట్టుకున్నారని కానీ వారు జగన్‌కు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సలహాదారుల కోసం జగన్ అనవసరంగా ఖర్చు చేస్తున్నారని అన్నారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారుల అంశంపై గతంలో హైకోర్టులో పిల్ వేశామని నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ సలహాదారులు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? వాటిని ఎక్కడైనా అమలు చేశారా? సలహాదారుల నియామకానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మార్చి 2023లో హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ సలహాదారులు ఎవరెవరిని ఏ శాఖకు కేటాయించారో జగన్ ప్రభుత్వం వెల్లడించాలని సలహాదారుల పేర్లు మొత్తం వెల్లడించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.